బైబిల్ చదవడం యొక్క ప్రాముఖ్యత

మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు

యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. (కీర్తనలు 19:7–11)

మనిషి తనకు కావలసినవన్నీ కలిగి ఉన్నప్పటికీ తన హృదయములో ఎప్పుడూ ఖాళీ స్థలం ఉంటుంది. మనుష్యులు తమ్మును తాము వినోదాలతోను, స్నేహములతోను లేదా ఇలాంటి వాటితో బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ హృదయంలో ఉన్న ఈ ఖాళీ స్థలం కేవలం మన సృష్టికర్తయిన దేవునితో సంబంధం కలిగి ఉండటం వలన మాత్రమే నింపబడుతుంది. దేవుని వలన మరియు ఆయన వాక్యముల వలన విశ్వాసులు ఎలా ఆనందంతో నింపబడ్డారో  మనం బైబిల్ లో చూడగలం. ఈ  ఆనందం ఎప్పటికీ తొలగిపోనిది.  ఎవరూ  తీసివేయలేనిది.  ఇది నిత్యము ఉండే ఆనందం. 

నిజమైన రొట్టె

చాలా మంది నిత్యము తమతో ఉండని భూసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతారు, కానీ యేసు ఈ విధముగా చెప్పారు:

అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. (మత్తయి4:4)

రోజుకి మూడు పూటలు ఆహారం తినడం మనం మరచిపోము. ఎలాగు మన శరీర వృద్ధికి ఆహారం అవసరమో అలాగే మన ఆత్మీయ వృద్ధికి దేవుని వాక్యం మనకు అవసరం. మనిషి కేవలం శరీరము మాత్రమే కలిగి లేడు కానీ ఆత్మను కూడా కలిగి ఉన్నాడు. మన ఆత్మ అదృశ్యమైనది మరియు నిత్యమైనది అందువలననే  మనము దానిని గూర్చి  చాలా జాగ్రత్త తీసుకోవాలి. 

దేవున్ని ప్రేమించుట

దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞలలో గొప్ప ఆజ్ఞ ‘ఆయనను ప్రేమించడం’:

ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ( ద్వితి 6:4–7)

 దేవుడిని ప్రేమించుట మరియు ఆయన వాక్యమును చదువుట అనేవి లోతుగా కలిసి ఉంటాయి.  మనము నిజముగా దేవునిని ప్రేమించినట్లయితే ఆయన వాక్యము ద్వారా ఆయనను తెలుసుకోవాలనే కోరిక కూడా మనము కలిగి ఉంటాము.  మనము బైబిల్ ప్రకారము జీవించటానికి బైబిల్ చదవడానికి సమయం తీసుకోవడం లేదంటే ఇది దేవుని పట్ల మనము ప్రేమ కలిగి లేమని చూపిస్తుంది.  యేసు కూడా దీని గురించి ఈ విధముగా చెప్పారు:

యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. (యోహాను 14:23)

 మేరీ సరైన ప్రాధాన్యతను కలిగి దేవుని పట్ల తన ప్రేమను వ్యక్తపరిచింది. యేసుక్రీస్తు యొక్క మాటలు వినాలని ఆమె నిర్ణయించుకుంది, దీనికి యేసు ఆమెను మెచ్చుకున్నారు: 

అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి, ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. (లూకా 10:38–42)

దేవుని వాక్యము వెలుగైయున్నది

 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. (కీర్తనలు 119:105)

మన పాపముల వలన మరియు అనేక తప్పుడు నిర్ణయాల వలన మన జీవితాలు దెబ్బతిన్నాయి. ఈ దెబ్బ తిన్న జీవితం నుండి మరల వెనుకకు రావటానికి ఒకటే మార్గం- దేవుని వైపు తిరగడం మరియు దేవుని చిత్త ప్రకారము జీవించాలనే ఆశను బలపరుచుకోవడం. ఒకవేళ మనము దేవుని వాక్యము యొక్క వెలుగును అంగీకరించనట్లయితే మనము చీకటిలో నడుస్తాము, అంటే పాపములో. ఎందుకంటే మనము పరిశుద్ధంగా జీవించడానికి దేవుని వాక్యము అనుదిన జీవితంలో మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యము నుంచి తమ బలమును పొందుకోవటమును పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు కూడా అనుభవించడమును మనము చూడగలము. 

యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? (కీర్తనలు 119:9)

దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడుట

ఎవరైనా బైబిల్ ను యదార్థమైన హృదయంతో చదివితే వారు పరిశుద్ధమైన దేవునిని ఎదుర్కొంటారు, మరియు ఆయన పరిశుద్ధత యొక్క వెలుగులో తమ బలహీనతలను మరియు పాపములను కూడా ఎదుర్కొంటారు.

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.  (హెబ్రీ 4:12–13)

దేవుని వాక్యం చేత పరిశుద్ధపరచబడుట మనల్ని దేవునితో కలుసుకోవడానికి సిద్ధపరుస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారమే జీవించాలి. ఎందుకంటే ఆ వాక్య ప్రకారమే చివరి దినమున మనకు తీర్పు తీర్చబడుతుంది.

 మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరచుటకు యేసుక్రీస్తు చెప్పిన మాటలు శక్తి గలవి: 

 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము. (యోహాను 17:17)

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. (కీర్తనలు 119:11)

మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే. (1 పేతురు 22–25)

 పైన చెప్పబడిన వాక్యములో నశించిపోయే వాటికన్నా దేవుని నిత్యమైన వాక్యం ఎంతో గొప్పదని మనం చూడగలము.

మనం బైబిల్ ను ఎలా చదవాలి 

చాలామంది బైబిల్ ను చదువుతారు. ఒక నియమాన్ని పాటించినట్లు కొంతమంది ఒక రోజుకి కొన్ని అధ్యాయాలను కూడా చదువుతారు. కానీ ఇటువంటి నియమాలను పాటించడం వలన దేవుని వాక్యం చదవడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని విడిచిపెడతారు. మనం ప్రార్థన ద్వారా దేవునితో ఏలాగు మాట్లాడుతామో అదేవిధంగా దేవుడు కూడా తన పిల్లలతో మాట్లాడాలని కోరుకుంటారు. బైబిల్ లో దేవుని వాక్యం ఎప్పటికీ మారనిది; మనము యదార్థమైన హృదయం మరియు వినే మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యం వివిధ సందర్భాలలో సమయాలలో మనతో మాట్లాడగలదు. 

 ఒక అలవాటుగానో లేదా సమాచారాన్ని సేకరించడానికో మనం బైబిల్ ను చదవకూడదు. కానీ దేవునితో యదార్థమైన మరియు లోతైన సంబంధం కలిగి ఉండటానికి చదవాలి. 

సీమోను పేతురు ప్రభువా, యెవని యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. (యోహాను 6:68)

ఇంతకు ముందు మాలో కూడా కొందరము బైబిల్ కు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా ఎంతగానో మాట్లాడగలరని మేము తెలుసుకున్నాము. మనము కలిసి చదవడానికి మరియు మాట్లాడడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. 

దేవుని వాక్యమును మన జీవితములో అనుసరించుట బైబిల్ ను చదవటం అంటే యేసుక్రీస్తు మాటలను వింటున్నట్లు; కానీ కేవలం వినడం సరిపోదు ఆ ప్రకారం జీవించడం కూడా ముఖ్యం. యేసు చెప్పినట్లు: 

ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. (మత్తయి 7:21–27)

 మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. (యాకోబు 1:22)

చాలామంది మనం సత్యాన్ని తెలుసుకోలేమని చెబుతారు. కానీ యేసుక్రీస్తు మాటల ద్వారా సత్యాన్ని మనము తెలుసుకోవచ్చు. ఈ సత్యం మాత్రమే మనల్ని మన పాపముల నుండి స్వతంత్రులుగా చేయగలదు:

కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను. (యోహాను 8:31–32)

నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. (కీర్తనలు119:164)

Scroll to top ↑