Download PDFDownload eBook (ePub)
యేసు యొక్క బోధ గురించి, ఆయన జీవితమును గురించి, ఆయన ఎందుకు చంపబడ్డారు మరియు మానవ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన వ్యక్తులతో ఆయనను మనం ఎందుకు పోల్చలేమనే విషయాలను గురించి మేము ఈ ఆర్టికల్ ద్వారా క్లుప్తంగా చెప్పాలని కోరుకుంటున్నాము.
ఎవరి జీవితం మరియు భోద ప్రపంచాన్ని మార్చిందో ఆ యేసుక్రీస్తు యొక్క సేవతో క్రైస్తవ్యం మొదలైంది. ఆయన ఒక యూదుడై [1]యుండి పాత నిబంధన గ్రంథం[2]లో వందల సంవత్సరాల క్రితం వాగ్దానం చేయబడిన రక్షకుడని చెప్పడం మాత్రమే కాక మిగిలిన మతాల నాయకులకు భిన్నంగా ఆయన మాత్రమే దేవుని దగ్గరకు మార్గం అని చెప్పి ఆయనను అనుసరించమని అందరినీ పిలిచాడు:
యేసు- నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను సువార్త 14:6)
దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయనను వ్యక్తిగతంగా కలిసిన వారి వలే మనం ఈ రోజు ఆయనను అనుభవించలేము కానీ ఆయనతో పాటు రేయింబవళ్ళు గడిపిన శిష్యుల యొక్క సాక్ష్యం మనకు ఉంది. ఆయన ఏమి చెప్పారు, ఎలా జీవించారు మరియు మొదటి క్రైస్తవుల యొక్క జీవితం గురించి వారు రాసిన విషయాలు క్రొత్త నిబంధన గ్రంథం[3]లో ఉన్నాయి.
యేసు బోధ ప్రత్యేకమైనది
నైతికత
నైతికత విషయంలో యేసు యొక్క బోధ మానవ చరిత్రలో అందరి బోధకులను మించినది.
వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా;నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన యెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయు; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా.నీ కుడిచెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన యెడల దాని నరికి నీ యొద్దనుండి పారవేయు; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. (మత్తయి సువార్త 5:27–30)
కోరికలను అధిగమించాలని మిగిలిన మతాలు కూడా బోధించినప్పటికీ, నిజానికి వారిలో కొందరు మంచే గానీ చెడే గానీ ఎటువంటి కోరికలు కలిగి ఉండకూడదు అని భావిస్తారు. కానీ మంచి కోరికలను కూడా విడిచిపెట్టాలనే వారి ఆలోచన ఇతరుల పట్ల ఆసక్తి లేని స్వార్థపూరితమైన జీవితానికి దారితీస్తుంది. ఎందుకంటే ఎదుటి వారికి మంచి చేయాలనే బలమైన కోరిక కలిగి ఉండటం నిజమైన ప్రేమకు అవసరం. వారి ఆలోచన మనిషిని తన మానవ స్వభావాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఒక నీటి చుక్క సముద్రంలో కలిసి పోయినట్లే మనిషి ఒక అధికమైన శక్తితో కలిసి పోవాలనేదే వారి ఆలోచన.
అయితే దేవుడు ఒక “శక్తిలా” కాదు కానీ మనల్ని ప్రేమించే పరలోకపు తండ్రి అని మన పాపముల వలనే మనం ఆయన నుండి వేరైపోయామని యేసు చూపించారు. మన జీవితాలను నిజమైన శాంతితో, నిరీక్షణతో, ఎల్లప్పుడూ ఉండే ఆనందంతో నింపగల దేవుని దగ్గరకు మనం తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే పాపం అనేది మన ఆలోచనలోనే మొదలవుతుంది కాబట్టి అక్కడే మనలో పశ్చాత్తాపం రావాలని ఆయన చెప్పారు.ఒక వ్యక్తి హృదయంలో దాగి ఉన్న విషయాలను ఆయన స్పష్టంగా బయలుపరుస్తాడు. ఉదాహరణకు మోహపు ఆలోచనలు కలిగి ఉండటం వ్యభిచారం అని చెప్పారు.
కొంత మేరకు ప్రతి మతంలోని నైతికతను గూర్చి మనం చూడవచ్చు. కానీ మన ఆలోచనలు, మాటలు, క్రియలు ఎలా ఉండాలని యేసు చెప్పారో అది ప్రత్యేకమైనది. ఎందుకంటే అది మనుషుల యొక్క హృదయాలను బయట పెడుతుంది. మన స్వభావంలో మరియు ఆలోచనల్లో గొప్ప మార్పు రావాలని ఆయన కోరుకుంటాడు.ఇదే పరిశుద్ధమైన జీవితానికి ఆధారం. ఎదుటివారిని ప్రేమించడానికి, మంచి చేయడానికి మనం ప్రతి పాపాన్ని విడిచిపెట్టడం ఎంత అవసరమో ఆయన స్పష్టంగా చెప్పారు.
మీ శత్రువులను ప్రేమించుడి
నీ పొరుగువానిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షం కురిపించు చున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు[4]ను ఆలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.(మత్తయి 5:43–48)
తమకు చెందని వారిని కూడ ప్రేమించమని మరియు శత్రువుల పట్ల దయ చూపించమని పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు మనం చూడగలం. అయితే మన శత్రువులను ప్రేమించాలన్న యేసు ఆజ్ఞ దానికి మించినది. మన పట్ల చెడుగా ప్రవర్తించిన వ్యక్తి గురించి తాను చేసిన చెడుని ప్రక్కన పెట్టి ఆ వ్యక్తిని మంచివాడిగా ఆలోచించమని యేసు చెప్పలేదు. కానీ యేసు ఆజ్ఞ ప్రకారం మన శత్రువుని ప్రేమించడం అంటే- వారి పాపం దేవుని ముందు ఎంత ఘోరమైనదో తెలిసినప్పటికీ వారి పట్ల ఎటువంటి కోపాన్ని ద్వేషాన్ని కలిగి లేకుండా వారి పాపము నుండి మారడానికి ఏదైనా అవకాశం ఉందేమో చూసి వారికి సహాయం చేయడం.
పాపములను క్షమించుట
పరిసయ్యుల[5]లో ఒకడు తనతో కూడ భోజనము చేయవలెనని ఆయన నడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగి యుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.అందుకు యేసు సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా, చెప్పుమనెను.అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారము[6]లును మరియొకడు ఏబది దేనారములును అచ్చి యుండిరి.ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మానలేదు.నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను.అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అను కొనసాగిరి.అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.(లూకా సువార్త 7:36–50)
ఈ పాపాత్మురాలైన స్త్రీ వలే మనలో ప్రతి ఒక్కరము పాపముల కారణంగా మన జీవితాలను ఎంత నాశనం చేసుకుని దేవునికి దూరమయ్యామో అనే విషయం యేసు చూపిస్తారు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రేమకు మనం సంతోషంగా కృతజ్ఞత కలిగి విధేయతగా జీవించాలి. దానికి బదులుగా మనం పాపంలో జీవించినట్లైతే ఆయనకు విరుద్ధంగా తిరగబడి మన సృష్టికర్తయైన దేవుడిని అవమాన పరుస్తున్నాము. ఈ పాపాన్ని మనం తీసివేయలేము, కానీ ఈ స్త్రీ వలే వినయం కలిగి క్షమాపణ కోసం విరిగిన హృదయంతో దేవుని వైపు తిరగగలం. యేసులో దేవుని ప్రేమను మనం పూర్తిగా పొందవచ్చు. మన పాపములను మనము పూర్తిగా అంగీకరించి, పశ్చాత్తాప పడిన యెడల మన పాపములను క్షమించే అధికారం ఆయనకు ఉన్నది.
మన ఆలోచనలను,స్వభావమును, క్రియలను మార్చుకోవడానికి కావలసిన శక్తిని ఆయన ఇవ్వాలనుకుంటున్నారు.పాపముల నుండి నిజమైన విడుదలను ఆయన మాత్రమే ఇవ్వగలరు. ఆ రోజుల్లో ఆయన మాటలు, క్రియలు మారలేమని నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను ధైర్యాన్ని ఇచ్చాయి.అలాగే ఈ రోజు కూడా ఆయన ఆశను నిజమైన మార్పును మనకు ఇవ్వగలరు.
కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసం చేయడు; కుమారుడెల్లప్పుడును నివాసము చేయును.కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.(యోహాను సువార్త 8:31–36)
నిజమైన నెమ్మదిని, శాంతిని మనము ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా ఆయనలో మాత్రమే పొందుకోగలము:
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి. (మత్తయి సువార్త 11:28–30)
యేసు జీవిత౦ ప్రత్యేకమైనది
ఒక బోధకుడు తాను బోధించిన ప్రకారం జీవించినప్పుడే అతని బోధ నమ్మదగినది. యేసును వ్యక్తిగతంగా తెలిసిన వారు ఆయన నిర్దోషమైన జీవితాన్ని గూర్చి సాక్షమిచ్చారు. అతని శత్రువులు, యూదులలో తమ పలుకుబడిని, గౌరవాన్ని కోల్పోతామని భయపడిన మత అధికారులు ఏ పాపమును గూర్చి ఆయనను నిందించలేకపోయారు. ఆయనను దోషిగా నిర్ధారించడానికి వారు మరలా మరలా ప్రయత్నించినప్పటికీ వారు చేయలేకపోయారు, కానీ ఆయన మంచి ప్రవర్తన మరియు మాటల చేత వారే సవాలు చేయబడ్డారు.
ఆయనను గూర్చిన వార్త ఇశ్రాయేలు దేశమంతటిలో తెలియబడింది .యూదా నాయకుడు హేరోదు, రోమన్ గవర్నర్ పొంతు పిలాతు వంటి రాజకీయ నాయకులు కూడా ఆయనతో వ్యవహరించాల్సి వచ్చింది. కాబట్టి యేసు ఒక వేళ ఏదైనా తప్పు చేసి ఉంటే ఆయనను తిరస్కరించిన యూదులు ఆయనను బహిరంగంగా నిందించడానికి ఎంతో సంతోషించి ఉండేవారని మనం ఖచ్చితంగా చెప్పగలం, కానీ అది జరగలేదు.
దేవునికి విధేయులై జీవించమని యేసు కేవలం చెప్పలేదు కానీ తన సొంత ఉదాహరణ ద్వారా తన శిష్యులను నడిపించాడు. తన మరణానికి ముందు రోజు సాయంత్రం ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు.ఇది వాస్తవానికి బానిసలు చేసే పనిగా పరిగణించబడేది కాబట్టి వారు ఎంతో ఆశ్చర్యపోయారు. కానీ ఒకరికి ఒకరు సేవ చేయడం అంటే ఏమిటో తన సొంత ఉదాహరణ ద్వారా చూపించడానికే ఆయన అలా చేసాడు.
తాను ఈ లోకము నుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు డగు ఇస్కరియోతు యూదా[7] హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి యుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి భోజనపంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టి వేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇకమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. (యోహాను సువార్త 13:1–15)
ఆయన శిష్యులు దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రతిరోజూ ఆయనతో ఉన్నారు. ఆయన ప్రేమ, వినయ స్వభావం అనేకసార్లు వారిని సిగ్గుపడేలా చేసి వారు మారడానికి సహాయపడ్డాయి. యేసు యొక్క జీవిత విధానం, ఆయన మాటలు వారిలో ఉన్న లోపాలను వారికి అర్థమయ్యేటట్లు సహాయం చేసాయి.వారివలే మనకు కూడా ఈ రోజు అవి సహాయం చేయగలవు.
యేసు చేసిన అద్భుతాలు, స్వస్థతలు ప్రత్యేకమైనవి
సువార్తల[8] ప్రకారముగా యేసు రోగులను స్వస్థపరచాడు, కుష్టు రోగులను బాగు చేశాడు, కుంటి వారిని నడిచేలా చేశాడు, చెవిటి వారిని వినేటట్లు చేశాడు, గ్రుడ్డి వారి కళ్ళు తెరిచాడు, దుష్టాత్మలతో భాదించబడిన వారిని విడిపించాడు. అంతేకాక మరణించిన వారిని కూడా లేపాడు. 5 రొట్టెలను 2 చేపలను విస్తరింపజేసి ఐదు వేల మందికి భోజనం పెట్టాడు,గాలిని మరియు సముద్రపు అలలను గద్దించి అణచివేశాడు.
యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ[9] యందంతటను సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తుల నందరిని, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి[10], యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతల నుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. (మత్తయి సువార్త 4:23–25)
ఆయన కాలంలో ఉన్న ప్రజలు వీటన్నిటినీ కళ్ళారా చూసి ఆశ్చర్యపోయారు అటువంటి క్రియలు అంతకు ముందు ఎన్నడూ జరగలేదు. అతని శత్రువులు కూడా వాటిని కాదనలేకపోయారు. ఆయన వలె అద్భుతాలు చేయడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ ఎవరూ చేయలేకపోయారు. ఆయన తన యొద్దకు వచ్చిన వారినందరిని అన్ని రోగాలను నయం చేసాడు.
ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను…ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదాని వలె అది బాగుపడెను. (మత్తయి సువార్త 12:9–13)
అయితే ఆయన అద్భుతాలు చేయడానికి గల కారణం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాదు గాని ఆయన బోధించిన ఆత్మ సంబంధమైన విషయాలు సత్యమని ప్రజలకు అర్థం కావడానికి వాటిని చేశాడు.మన పాపముల నుండి నిరాశ నుండి మనల్ని విడిపించి దేవుడితో ఆయన పిల్లలతో ఎల్లప్పుడూ సంతోషంగా, శాంతితో మనము జీవించగలిగే టట్లు చేయడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు ఆయనే.
వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్లుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి — ఏడ్వవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాటలాడ సాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. (లూకా 7:11–15)
మార్తా, మరియా అక్కాచెల్లెళ్లు, వారి సోదరుడు లాజరు.ఈ ముగ్గురూ యేసు యొక్క శిష్యులు. ఆయన వారిని ప్రేమించాడు. ఒకరోజు లాజరు అనారోగ్యంతో చనిపోయాడు.
యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను… మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెను గాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమె నడిగెను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు[11]వని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను…అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదముల మీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,వారు ‑ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు ‑అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.వారిలో కొందరు ఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.యేసు మరల తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది యొక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి యుండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పి లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టి యుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. (యోహాను సువార్త 11:1–46)
అన్నిటికంటే గొప్ప అద్భుత౦: యేసు పునరుత్థాన౦
యేసు కాలంలో ఉన్న యూదమత నాయకులు అనేక మంది ప్రజలు ఆయనను అనుసరించడం చూసి ఆయన పట్ల అసూయ పడి కోపంతో నిండి పోయారు. ఆయనలో ఏ పాపాన్ని గాని, ఆయన మాటల్లో ఏ తప్పును గానీ వారు నిరూపించలేక పోయారు. కనుక చివరికి ఆయనను చంపాలని ఆలోచించి ఆయనను చంపేశారు. అయితే వారి యొక్క ప్రణాళికలు ఆయనకు తెలిసినప్పటికీ కావాలనే వారిని వ్యతిరేకించకుండా ప్రేమ ద్వారా చెడును అధిగమించాలని కోరుకున్నాడు.
వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు[12] ప్రధానయాజకులకును శాస్త్రులకును[13] అప్పగింపబడును; వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనుల[14] కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.(మార్కు సువార్త 10:32–34)
నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. (యోహాను సువార్త 10:17,18)
నేరస్థులను శిక్షించినట్లుగా అవమానకరంగా వారు ఆయనను సిలువ వేసి శిక్షించారు.ఆయన చనిపోయిన మూడు రోజుల తర్వాత మరణం నుండి లేచాడు. ఆయన మరణాన్ని మరియు పునరుద్ధానమును కళ్లారా చూసిన వారి యొక్క సాక్షాన్ని మనం బైబిల్లో చూడగలం. ఆయన మరణానికి ముందు ఆయనతో ఉన్న అనేకమంది మరలా ఆయనను చూశారు, ఆయనతో మాట్లాడారు, ఆయనను ముట్టుకున్నారు మరియు ఆయనతో కలిసి తిన్నారు. 40 రోజుల పాటు 500 మందికి పైగా తన శిష్యులకు వివిధ సందర్భాలలో ఆయన కనిపించాడు. పాత నిబంధన తనను గూర్చి, తన మరణాన్ని గురించి మరియు పునరుద్ధానమును గురించి ఏమి చెబుతుందో వారికి వివరించాడు. ఆ 40 రోజుల తర్వాత యేసు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఎలాగైతే ఆయన శిష్యులు పునరుద్ధాన యేసుతో సంబంధాన్ని కలిగి ఉన్నారో అలాగే మనము కూడా మన అనుదిన జీవితంలో ఆయన సహాయాన్ని అనుభవిస్తాము.మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన జీవితాలను మారుస్తాడు.మరియు మనం ఏమి చేయాలో మనకు అర్థమయ్యేటట్లు చేసి అందుకు కావలసిన శక్తిని మనకు ఇస్తాడు.చెడు విజయం సాధించదని ఆయన పునరుద్ధానం ద్వారా స్పష్టమైంది. నీతిమంతులకు మరణం ముగింపు కాదనీ తరువాత నిత్య జీవితం ఉందని దేవుడు లోకానికి చూపించాడు. యేసు దేవుని యందు విశ్వాసము ఉంచెను. ఆయన నమ్మదగినవాడని యేసుకు తెలుసు. ఆయన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఇది సత్యమే- వారికి మరణం ముగింపు కాదు, భయంకరమైన విషయమూ కాదు గాని వారు మరణించినప్పటికీ నిత్యము దేవునితో కలిసి జీవిస్తారు.
మన జీవితానికి వీటి అర్థమేంటి ?
రెండు వేల సంవత్సరాల క్రితం యూదాలో ఉన్నవారంతా ఆయన మాటలు వినాలని, ఆయన చేసిన అద్భుతాలు చూడాలని కోరుకున్నారు. ఎవరైతే ఆయన మాటలను వారి హృదయంలో అంగీకరించారో, ఆయన సందేశాన్ని అర్థం చేసుకున్నారో వారు తమ జీవితాలను పూర్తిగా మార్చుకున్నారు. యేసును తమ ప్రభువుగా అనుసరించడం ప్రారంభించి మరణం నుంచి కూడా వెనుతిరగకుండా ఆయనను వెంబడించారు.
ఈనాటికీ అదే జరుగుతుంది, ఎవరైతే ఆయన మాటల యందు విశ్వాసం ఉంచుతారో ఆ మాటల యొక్క శక్తిని వారి జీవితంలో అనుభవించగలరు. ఆయన మాటలు మంచిగా వ్యక్తపరిచిన ఆలోచనలు కాదు గానీ మన జీవితాలకు ఒక సవాలు. యేసు మన హృదయాలను చేరుకోవాలని కోరుకుంటాడు, ఆయన వెళ్లిన మార్గంలో వెళ్ళమని మనల్ని పిలుస్తున్నాడు. పాపములో ఉన్న మన జీవితాలను ఆయన సత్యము విడిపించగలదు. దీని అర్థం- మనల్ని గూర్చిన సత్యాన్ని మనం చూడడం, మనలో ఉన్న పాపాన్ని గ్రహించి దానిని ఒప్పుకోవడం. యేసు ద్వారా దేవుని క్షమాపణ మనకు అవసరమని అంగీకరించడం. అప్పుడు మన పాపములను విడిచి పెట్టడానికి కావలసిన శక్తిని ఆయన ఇవ్వగలడు. స్వార్థం, అపవిత్రమైన జీవితం, అబద్ధాలు, ఎదుటివారికి అందంగా కనిపించాలనే వ్యర్థ ఆలోచనలు,అసూయ, కోపం, పగ,గర్వం,మన జీవితం వ్యర్థం అనుకునే ఆలోచనలు విడిచి ఇప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం ప్రారంభించగలము.
దేవునికి మరియు ఒకరికి ఒకరము సేవ చేయడానికి ఆయనే మనకు ఈ నూతన జీవితాన్ని ఇస్తాడు. యేసు చెప్పారు,
అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. (మత్తయి 22:37–39)
మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. (యోహాను13:34)
ఆయన పునరుర్ధానుడై ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఆయన బోధించిన ప్రకారం విధేయత కలిగి ఒకరికి ఒకరు సేవ చేయడం, ఒకరిని ఒకరు ప్రేమించడాన్ని ఆయన శిష్యులు అనుసరించారు.
బైబిల్లో యేసు గురించి మొదటి క్రైస్తవుల గురించి మనకు ఎంతో నమ్మదగిన సమాచారం ఉన్నందుకు క్రైస్తవులుగా మేము ఎంతో సంతోషిస్తున్నాము. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడానికి మేము ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాము, యేసును తెలుసుకోవడానికి బైబిల్ చదవమని మేము మిమ్మల్ని కూడా ప్రోత్సహించాలని అనుకుంటున్నాము.
క్రైస్తవ్యం పేరుతో వచ్చే లెక్కలేనన్ని డినామినేషన్లతో(సంస్థలతో ) మిమ్మల్ని మీరు గందరగోళానికి గురి చేసుకోవద్దు. మీరు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే బైబిల్ లోని సువార్తలలో ఒక దాన్ని చదవడం ద్వారా యేసు గురించి ఆయన బోధించిన విషయాలను గురించి మీరే తెలుసుకోగలరు. (ఉదాహరణకు మార్కు లేదా లూకా). మీరు బైబిల్ ని ఇంటర్నెట్ లో కూడా చదవొచ్చు. మీరు ఒకవేళ బైబిల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ప్రారంభంలో NIV(న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ )ను ఎంచుకోవడం మంచిది.
మాతో కలిసి బైబిల్ చదవడానికి కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. యేసు మాటలను అర్థం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి కలిసి బైబిల్ చదవడం ఎంతో సహాయపడుతుందని మాలో ప్రతీ ఒక్కరమూ అనుభవించాము.
[1] — ఇశ్రాయేల్ పౌరుడు
[2] బైబిల్ యొక్క మొదటి భాగం
[3] బైబిల్ యొక్క రెండవ భాగం
[4] దేవుడికి లోబడని వారు
[5] యూద మత నాయకుల పార్టీలలో ఒకటి
[6] ఒక రోజుకి కూలీ వారికి ఇచ్చే రోజువారీ జీతం
[7] యేసు శిష్యుల్లో ఒకడు
[8] క్రొత్త నిబంధనలో మొదటి నాలుగు పుస్తకాలు:మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను
[9] ఇశ్రాయేలులో యేసు నివసించిన ప్రాంతం
[10] దెకపొలి మరియు యూదయ- పురాతన ఇశ్రాయేలులో ఉన్న ప్రాంతాలు
[11] హెబ్రీ భాషలో రక్షకుడని అర్థం
[12] యేసు తనను ‑మనుష్య కుమారుడని పిలుచుకున్నాడు
[13] యూదా మత నాయకులు
[14] యూదులు కాని వారు