Download PDFDownload eBook (ePub)
“సహోదరులారా మేమేమి చేయవలెను?”
సంఘజీవితం యొక్క ప్రారంభం
ఈ క్రింది వాక్యభాగాన్ని అపొస్తలుల కార్యములు 2:32–47 లో మనం చూడవచ్చు, ఇది పెంతెకొస్తను దినమున పేతురు యూదులతో ప్రసంగించిన మాటలలో చివరి భాగం మరియు విశ్వసించిన వారియొక్క స్పందన :
ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి.
ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
పేతురు కూడా యేసుక్రీస్తువలె మొదట మారుమనస్సును గూర్చి బోధించెను. దేవుని పిల్లలుగా క్రొత్త జీవితం జీవించాలంటే ఒక్కటే మార్గం - మన పాత పాపజీవితాన్ని విడిచిపెట్టడం . ఎవరైనా దేవుని యెద్దకు రావాలనుకుంటే వారు తమ పాపములతో వెలుగు నొద్దకు రావాలి ఎందుకంటే పాపములు వారిని దేవుని నుండి మరియు ఇతరుల నుండి వేరుచేస్తాయి .
మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల.మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1యోహాను 1:5–7)
యథార్థమైన హృదయంతో మాత్రమే మనుష్యులు పరిశుద్ధమైన దేవుని యొద్దకు రాగలరు. ఎవరైనా తన పాపములను దేవునిముందు దాచకుండా బయటపెడితే దేవుడు వాటిని క్షమిస్తాడు. దేవుని ఆత్మకు లోబడటం వలన దేవుడు అతనిని క్షమించి నూతన వ్యక్తిగా మారుస్తాడు. దేవుని ఆత్మ మారుమనస్సు పొందిన వానిని ప్రేమ జీవితానికి నడిపిస్తాడు.“ప్రేమ అంటే తమ సంపూర్ణ జీవితం అర్పించడమని యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు యొద్ద నేర్చుకున్నారు.ఇలా వారి పూర్తి జీవితం అర్పించడమే ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసుల జీవితానికి పునాది. దేవుడు తన పిల్లల హృదయంలో కుమ్మరించిన ప్రేమ వారిని తమ కొరకు కాక ఇతరుల కోసం జీవించడానికి బలవంతం చేస్తుంది.
పౌలు ఈ విధముగా వ్రాసారు :
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
(2 కొరింథీయులకు 5:14,15)
యేసుక్రీస్తు వలె మొదటి క్రైస్తవులు కూడా తమ కొరకు జీవించాలని అనుకోలేదు . ఈ విధముగా ప్రేమగా జీవించడానికి తమకు అడ్డుగా ఉన్న ప్రతిదానిని విడిచిపెట్టడానికి వారు సిద్ధపడ్డారు - అవి ఇండ్లుగానీ, పొలములుగాని, కుటుంబసభ్యులుగాని, భవిష్యత్ గురించిన ప్రణాళికలుగాని మరిఏమైనను. దేవుని సేవించుటకు మరియు ఇతరుల రక్షణ కొరకు వారికి అడ్డుగా ఉన్న వేటినైనను పోగొట్టుకొనుటకు సిద్ధపడ్డారు. ఈ విధముగా కాక మరి ఏ విధముగా సేవించలేరని యేసుక్రీస్తు శిష్యులకు బోధించారు. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు దానితో పాటు గొప్ప వాగ్దానం కూడా ఇచ్చారు.
పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (మార్కు10:28–30)
వారు తమ్మును తాము ఉపేక్షించుకొనుటకు సిద్దపడి తమ ఇష్టానుసారమైన జీవితాలను విడిచిపెట్టడం వలన వారు దేవుని రాజ్యం కోసం అందుబాటులో ఉండేవారు. వారు ప్రతిరోజు తమ సమయమును దేవాలయములో గడుపుతూ అక్కడ ఉండే ఇతర యూదులతో మాట్లాడి యేసుక్రీస్తే మెస్సయ్య అని సాక్షమిస్తూ ఉండేవారు . వారు ప్రతిరోజు తమ ఇంట్లో కూడుకొని సహవాసము చేసేవారు. వారి చిన్న సహవాసములో ప్రతి ఒక్కరు అందరికీ తెలిసేవారు. వారిమద్యలో ఎటువంటి కార్యక్రమాలు జరిగేవి కావు. ఎందుకంటే కార్యక్రమంలో బాధ్యత లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు కానీ వారిలో ప్రతిఒక్కరూ బాధ్యతతో ఉండేవారు.
అంతకుముందు వారు దూరస్థులు, పరాయివారు మరియు శత్రుభావం కలిగినవారయినప్పటికీ తరువాత వాస్తవంగా ఒకరికి ఒకరు సహోదరులుగా, సహోదరీలుగా, తల్లిదండ్రులుగా మరియు పిల్లలుగా అవ్వడం అనుభవించారు. సంఘం అందరిని ఆహ్వానించేది- ధనికులను, బీదవారిని, పురుషులను, స్త్రీలను, యూదులను, అన్యజనులను, బానిసలను, స్వతంత్రులను, యవ్వనులను, మరియు వృద్దులను. వారియొక్క సహవాస జీవితము అపొస్తలులు బోధించిన యేసుక్రీస్తు జీవితం,ఆజ్ఞలు అలాగే దేవుని స్వభావం,చిత్తం పై ఆధారపడి ఉండేది.
యేసుక్రీస్తు ప్రజలకు సేవచేసిన ప్రకారముగా వారుకూడా ఒకరికి ఒకరు సేవచేస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ, గద్దిస్తూ,సరిచేసుకుంటూ ఉండేవారు. వారు వీలైనంత ఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడపటం వలన ఒకరి గురుంచి ఒకరు బాగా తెలుసుకొని ఉండేవారు. తమ సహోదరులకు, సహోదరీలకు ఏ విషయములలో సహాయం కావాలో వారికి బాగా తెలిసేది. ఈ రోజుల్లో ఉన్న సంఘములలో సంబంధం పైపైదిగా, తాత్కాలికమైనదిగా ఉంది గనుక వారిమధ్య నిజమైన ప్రేమ ఉండట్లేదు, ఎందుకంటే వారు తమ వ్యక్తిగత జీవితాలను ఒకరితో ఒకరు పంచుకోవడం లేదు.
ఆ రోజుల్లో క్రైస్తవులు తమ సంతోషమును మరియు దుఃఖమును ఒకరితో ఒకరు పంచుకుంటూ, తమ పాపములను, బలహీనతలను ఒకరితో ఒకరు ఒప్పుకొనుచూ మరియు తమ విశ్వాస పోరాటములలో సహాయం చేసుకుంటూ ఉండేవారు. దేవుని సంతోషపెట్టే పరిశుద్ధమైన జీవితం జీవించటానికి వారందరు ఒకరికి ఒకరు సహాయం చేయడానికి ఆశ కలిగి ఉండేవారు. ఆ ఆశతో వారు వీటన్నిటిని చేసేవారు ఎందుకంటే వారి విశ్వాస లక్ష్యము అనేది “దేవుని సన్నిధిలో నిత్య సంతోషం చేరుకోవడం“. ప్రతిరోజూ సహోదరులను ప్రోత్సహించటం ఎంత ముఖ్యమో మనం హెబ్రీయులకు 3:12–14 లో చూడగలము:
సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక,పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
వారి ప్రేమ, భక్తి మరియు ఐకమత్యము ద్వారా వారు యేసు చెప్పిన వెలుగుగా మారారు, దీని వలన చుట్టుప్రక్కల ప్రజలందరూ ఆశ్చర్యపోయారు . వారివలె పరిశుద్ధ జీవితం జీవించాలనే ఆశ కలిగిన వారు తప్ప మరెవ్వరు కూడా వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. (అపొ కార్యములు 5:13,14)
వారందరు యేసుక్రీస్తే రక్షకుడని, అతను చెప్పిన మాటలు నిజమని నమ్మటం వలన వారందరు ఐకమత్యము పొందారు. కానీ వారిలో ఎవరైనా తమ సొంత మార్గంలో నడవాలని అనుకున్నా లేక నిస్వార్థంగా ప్రేమించలేకపోయినా ఆ ఐకమత్యము నిలువదు. ఒకవేళ క్రైస్తవులు నిజాయితి లేనివారిగా మారితే అది ఎంత వినాశనమో మనం అననీయ,సప్పీరా ల ఉదాహరణలో చూడొచ్చు.
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను; అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.
అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ చెప్పెను. వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. (అపొ కార్యములు 5:1–11)
వారిద్దరూ కలిసి తమ పొలమును అమ్మారు కానీ దాని ద్వారా వచ్చిన డబ్బు అంతటిని ఇస్తున్నట్లుగా నటించి అపోస్తులతో అబద్దం చెప్పారు. వారు నిజముగా మంచి కారణం ఉన్నట్లయితే ఆ డబ్బును ఉంచుకోవచ్చు, తమ ఆలోచనను కప్పిపెట్టుకోవలసిన అవసరం లేదు. వారు బహిరంగముగా, నమ్మకంతో ప్రతి విషయమును మాట్లాడి ఉండవలసినది. కపటము గలవారు దేవుని సంఘములో నిలవలేరు. వారు కలిసి దేవునికి సేవ చేయడానికి నమ్మకం అవసరం కానీ ఎవరైనా దేవుని చిత్తమును యదార్థంగా వెతుకకపోతే ఆ నమ్మకం ఉండదు. కానీ మొదటి క్రైస్తవులు తమ ఆస్తులను పంచుకోవడం మనం చూడగలము.
“విశ్వసించిన వారందరు తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి” (అపొ కార్య2:44)
ముందు చెప్పిన వాక్యభాగం మార్కు 10:28–30 లో యేసుక్రీస్తు తన శిష్యులకు ఇళ్లను మరియు పొలములను కూడా వాగ్దానం చేసారు. క్రైస్తవులలో ఈ వాగ్దానం నెరవేర్చబడింది ఎలాగంటే వారు తమ సొంత ఆస్తులను తమవిగా భావించలేదు. వారికి ప్రతీది సమిష్టిగా ఉండేది మరియు వారికి కలిగిన అన్నిటిని విశ్వాసములో ఉన్న తమ సహోదరులతో సహోదరీలతో పంచుకునేవారు. ఇలాగ చేయమని వారికి ఎవరూ చెప్పలేదు. వారు దేవుని ముందు తమ మనస్సాక్షిని అనుసరించి తమ ఆస్తులను ఏ విధముగా ఉపయోగించుటకైనను సిద్ధముగా ఉన్నారు. బయటనుండి చూసే వారికి “ఇలా ఆస్తులను పంచుకోవడం“ క్రైస్తవుల విశ్వాసమునకు, ఐక్యతకు మరియు ప్రేమకు గొప్ప చిహ్నముగా ఉండేది. ఇది మనం లోకంలో ఎక్కడా చూడలేము. వారు నూతన సృష్టిగా మారటం వలన వారు తమ ఆస్తులను ఇకను అంటిపెట్టుకొని ఉండలేదు. వారు నశించిపోని వాటిని అమూల్యమైన ఆస్తిగా భావించి ఉండేవారు గనుక నశించిపోయే తమ ఆస్తులను దేవుని రాజ్యము కోసం అప్పగించుకోవటానికి సిద్ధపడ్డారు. వారు తమకి కలిగినదంతా ఒక డబ్బుల పెట్టెలో పెట్టలేదుగాని, తమకు కలిగినదానిని బట్టి అవసరానికి ఇచ్చేవారు.
ఇది కేవలం అపొస్తలుల కార్యము 2 వ అధ్యాయంలో మాత్రమే కాదుగాని అపొస్తలుల కార్యము 4: 32–35 లో కూడా ఉంది.
విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
క్రైస్తవులు మాటలతో కాదుగాని క్రియలతోను, సత్యముతోను ప్రేమించుకునేవారు.
ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. (1 యోహాను 3:16–18)
క్రైస్తవులలో ఆస్తులు పంచుకోవడం అనేది మనం సంపూర్ణంగా ఇతరుల మీద ఆధారపడటం అని కాదు, కానీ అందరు తమకు తామే పనిచేసి సంపాదించాలి మరియు సాధారణమైన జీవితం జీవిస్తే ఇతరుల అవసరాల కొరకు కూడా ఇవ్వగలరు.
పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన విధముగా:
మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు–ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివిు గదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. (2 థెస్సలొనీకయులకు 3:10–12)
ఈ రోజుల్లో సహోదర ప్రేమ కంటే మతపరమైన సంప్రదాయాలకు మరియు సభలకు హాజరు కావడం ఇటువంటి వాటికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఈ విధముగా మారిపోవటం వలన ప్రజలు తమకు కలిగిన వాటిని ఇతరులతో పంచిపెట్టుటకు సిద్ధముగా లేరు. బైబిల్ లో ఎక్కడా చూడని చర్చి టాక్సులు (సంఘపు పన్నులు) ఈ రోజుల్లో నామమాత్రపు సంఘములలో ఉన్న క్రైస్తవులలో మనం చూస్తున్నాం మరియు దశమభాగం ఇవ్వటం వలన కూడా ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే వారికి కలిగిన మొత్తములో కొద్దిభాగం మాత్రమే ఇస్తున్నారు. ఈ రోజుల్లో ఆస్తులను పంచుకోవడం సాధ్యము కాదని సంఘములలో ఉండే బోధకులు ఎన్నో వాదనలు చేస్తూ ఉంటారు, సంఘంలో ఉండే విశ్వాసులు కూడా ఈ లోకంలో ఉన్నవాటి పై స్వార్థం కలిగి ఉండడం వలన వారికి ఇలాంటి బోధలు వినటం ఇష్టం.
పైన చెప్పబడినట్లు అనేకమైన సంఘములలో దశమభాగం ఇవ్వటం సహజం, చాల మంది ఇది బైబిల్ ప్రకారంగా ఉందని అనుకుంటారు. అవును ఇది మనం బైబిల్ లో చూడవచ్చు కానీ క్రైస్తవుల మధ్యలో కాదు. పాత నిబంధనలో యాజకులు మరియు లేవీయులు చేసిన సేవకుగాను వారికి సహకరించుటకు ప్రజలు దశమభాగం ఇచ్చేవారు. దాని నుంచి బలులు అర్పించుటకు కూడా ఇవ్వబడింది. ఇది మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండం 14:28–29 లో చెప్పబడిన ప్రకారం ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి దేశంలో ఉండే పేదవారికి పంచిపెట్టేవారు. కానీ నూతన నిబంధనలో క్రైస్తవుల మధ్య ఈ దశమభాగ పద్ధతి మనం ఏ మాత్రం చూడలేము దాని స్థానంలో ఏమి చూస్తామంటే వారికి కలిగిన ప్రతిదీ వారు పంచుకునేవారు. ఇది మనం అపొ కార్యము 4:32 లో చూడగలము.
విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి.
ఇంత గొప్ప నమ్మకం మనం ఈ రోజుల్లో కుటుంబములలో కూడా చూడలేము, డబ్బు విషయంలో కూడా వారిలో ఈ నమ్మకం ఏ మాత్రం తగ్గేది కాదు. వారు ఒకరి జీవితం గురుంచి మరొకరు తెలుసుకోవడం వలన వారిలో ఇంత గొప్ప నమ్మకం సాధ్యమయ్యేది. తమ సహోదరులు ఎంత యదార్థంగా దేవుని చిత్తాన్ని వెతికేవారో వారికి తెలిసేది. ఇలాగ వారు ఒకరికి ఒకరు తెలుసు కాబట్టి తమ డబ్బులను మరియు వస్తువులను ఒకరితో ఒకరు పంచుకోగలిగేవారు. తమ సహోదరులు వాటిని దేవుని చిత్త ప్రకారమే ఉపయోగిస్తారని వారికి బాగా తెలిసేది.
తోడేళ్ళ మధ్యలో గొఱ్ఱెలు
మొదట్లో యెరూషలేములో ఉన్న ప్రజలు క్రైస్తవులను ఎంతో గొప్పగా భావించేవారు. కానీ ఇది ఎంతో కాలం నిలువలేదు, యేసుక్రీస్తు ముందుగా చెప్పిన ప్రకారం ప్రవచనం నెరవేర్చబడింది:
ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి;వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు, వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు,ఏలాగు మాట్లాడుదుము?ఏమి చెప్పుదుము?అని చింతింప కుడి;మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును. (మత్తయి 10:16–22)
యూదా మత నాయకులు ఈ క్రొత్త “తెగ” విస్తరించకుండా అణచివేయడానికి మొదటి నుంచి ప్రయత్నము చేసారు. ఈ మత నాయకులు ఇతర యూదా ప్రజల పై ఉన్న అధికారం మరియు వారి నుండి వచ్చే గౌరవం కోల్పోతారేమో అని భయపడ్డారు. వారు తమ జీవితం విషయమైన సంకల్పమును తిరస్కరించారు. కాబట్టి వారు అపొస్తలులు బోధించడం నిషేధించి, వారిని కొట్టి చెరసాలలో బంధించారు. కానీ అపొస్తలులు ప్రజలకు బోధించడం మానలేదు. వారు యేసుక్రీస్తే మెస్సయ్య అని సువార్త ప్రకటించడం కొనసాగించారు.
వారు ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక ఇలా బోధించేవారు. (అపొ కార్యము 5:42)
స్తెఫను ”యూద మహాసభలో” ఉన్న సభ్యులకు, యేసుక్రీస్తును హత్యచేసి, దేవున్ని వ్యతిరేకించారని తమ తప్పును వారికి చూపించినందున వారు స్తెఫనును రాళ్లతో కొట్టి చంపారు. ఈ విధముగా స్తెఫను మొదటి హతసాక్షిగా యేసుక్రీస్తును వెంబడించాడు. పౌలు సువార్త ప్రకటించినప్పుడు తరచుగా యూదుల నుండి మరియు అన్యజనుల నుండి అనేకమైన హింసలు పొందినట్లు మనం చూడగలం.
క్రైస్తవులు వారి కాలంలో ఉన్న లోక మర్యాదలను అనుసరింపలేదు. దేవుని ఇంటివారై ఉండి, సువార్త సత్యము గురించిన తమ బాధ్యతను ఎరిగిఉండేవారు. మారుమనస్సు పొందుటకు ఎవరైతే వ్యతిరేకించెరో అటువంటి అవిశ్వాసుల మధ్య కూడా ఆ సువార్త సత్యమును గట్టిగా చేపట్టి ఉండేవారు. ఈ క్రైస్తవులు వారి జీవితం ద్వారా మనుషులందరి పట్ల దేవుని చిత్తమును చూపించడానికి ఆశకలిగి ఉండేవారు. మూర్ఖమైన వక్రజనము ఉన్న ఇటువంటి లోకంలో జ్యోతుల వాలే ప్రకాశించమని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించారు (ఫిలిప్పి 2:15). క్రైస్తవులు లోకమును ఈ దృష్టితో చూసేవారు, ఎందుకంటే లోకముతో స్నేహము దేవునితో వైరమని వారికి తెలుసు (యాకోబు 4:4). గనుక వారి విలువలు మరియు క్రియలు, తమ ఇష్టానుసారంగా జీవించే వారి చుట్టూ ఉండే ప్రజలకు వేరుగా ఉండేవి. ఇటువంటి జీవితాన్ని దేవుని క్రియగా ఎవరైతే అంగీకరించలేదో వారు సువార్తను వ్యతిరేకించి, సువార్త ప్రకటించేవారిని హింసించారు.
తరువాత రెండవ, మూడవ శతాబ్దంలో కూడా ఎవరైతే యేసుక్రీస్తు యందలి తమ విశ్వాసమును ఒప్పుకునేవారో వారిని సమాజంలో వెలివేయబడిన వారుగా ప్రజలు చూసేవారు. అనేకమంది ఈ లోక సంబంధమైన వాటియందు ఆనందిస్తుండగా వీరు అటువంటి వాటికి దూరముగా ఉండేవారు. వారు పండుగలలోను లేదా మతపరమైన ఆచారాలలోను పాల్గొనేవారు కాదు గాని ప్రజలను తమ పాప జీవితంలో నుండి మారుమనస్సు పొందమని పిలిచేవారు. ఇలా చేస్తూ ఉండడం వలన వారికి ప్రజల నుండి వైరము కలిగేది. కొందరు వారి గురుంచి చాల చెడ్డ పుకార్లు కల్పించేవారు. రోమా సామ్రాజ్యమువారు అనేకమంది క్రైస్తవులను ఎటువంటి ఆధారం లేకుండా శిక్షవిధించి హింసించేవారు.
ఈరోజు మనకు దాని అర్థం ఏమిటి?
మనము పైన చూసిన విధముగా మొదటి క్రైస్తవుల యొక్క జీవనశైలి తమకు తాము నిర్ణయించుకున్న కొన్ని పద్ధతులు కావు. వారు సంతోషమును, దుఃఖమును, ధనమును, ఆస్తిని, వరములను, అనుదిన జీవితమును - వారి జీవితంలో వారికి కలిగిన ప్రతిదానిని ఒకరితో ఒకరు పంచుకునేవారు. వారు దేవునికి చివరివరకు నమ్మకంగా ఉండటానికి ఎప్పుడూ ఒకరికి ఒకరు ప్రతి విషయంలో సహాయం చేయటానికి ఆశ కలిగి ఉండేవారు. వారు యేసుక్రీస్తు శిష్యులుగా ఉండి ఆయన యొక్క ప్రేమను అనుసరించుటకు ఆసక్తి కలిగి ఉండేవారు.
ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై యున్నాము. (1యోహాను 3:16)
వారు నిజమైన సహోదర సహోదరీల వాలే ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారు. ఇది దేవునిపట్ల వారికున్న ప్రేమను చూపించేది. యోహాను దీనిని స్పష్టంగా చెప్పారు:
ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము. (1 యోహాను 4:19–21)
ఈ రోజుల్లో కూడా ఎవరైనా క్రీస్తును వెంబడించి క్రైస్తవులుగా మారాలంటే ఇది వారికి కూడా వర్తిస్తుంది. క్రైస్తవుడిగా జీవించడం అంటే నాకు దేవునికి మధ్య సంబంధం ఉంటే చాలు అని ఆలోచిస్తూ కొన్ని మతపరమైన సభలకు మరియు కార్యక్రమాలకు హాజరవుతూ ఉండటం అనేది తమను తాము మోసపరచుకోవడం వంటిది. దీనివలన ఘోరమైన పరిణామాలు ఉంటాయి. “సంఘమే క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె, ఒక్క క్రైస్తవుడు కాదు”. సంఘము కూడా క్రీస్తు శరీరముగా పిలువబడింది. ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తే అందరము ఆ శిరస్సుతో ఏకమై ఉండాలి అప్పుడే శిరస్సు అందరిని దేవుని సేవ కొరకు నడిపిస్తుంది.
మా జీవితాలలో మేము ప్రతి విషయంలో మొదటి క్రైస్తవుల ఉదాహరణను అనుసరించాలని కోరుకుంటున్నాము, మాతో కలిసి అలాగే జీవించడానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. యేసుక్రీస్తును యదార్ధంగా వెతికే వారిని కలుసుకోవటానికి ఎంత దూరమైన ప్రయాణం చేయటం కూడా మాకు సంతోషమే. ఈ మార్గమును కోరుకునేవారు ఎంతోమంది లేరని యేసుక్రీస్తు మాటల ద్వారా మాత్రమే కాక మా అనుభవం ద్వారా కూడా మాకు తెలుసు. ఏ కాలంలోనైనా అనేకులు దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడరని మానవ చరిత్రలో కూడా మనం చూడగలము.
మా జీవితాలను మార్చిన దేవుని శక్తి గురించి మా జీవితం ద్వారా మేము సాక్ష్యము ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజుకి ఈ మార్గంలో జీవించడం వీలవుతుందా అని మీరు సందేహిస్తున్నట్లయితే అల్పవిశ్వాసం కలిగి ఉండొద్దని మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము, ఈ మార్గంలో జీవించడం ఎంతో ఆశీర్వాదకరం. ఇంతేకాకుండా నిజమైన సద్గుణములలో ఎదుగుట కూడా ఎంతో అవసరం అవి: వినయము, నిస్వార్ధత, మనల్ని మనము ఉపేక్షించుకొనుట, భక్తి కలిగిఉండడం, దీనమనస్సు, సహనము, ఇతరులను మనకంటే గొప్పగా భావించడం, మన సొంత ప్రయోజనమును వదులుకొనుట మరియు ఇతరులకు ఏది మంచిదో అది చేయడం. ఈ మార్గంలో యేసుతో కలిసి నడవటం వలన ఇవన్నియు చేయుటకు ఆయన మాకు శక్తిని అనుగ్రహించుట మేము అనుభవిస్తున్నాము. ఇంతేకాకుండా మా పట్ల ఆయనకు ఉన్న ప్రేమను మేము మరి ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాము కాబట్టి ఆయనని మరి ఎక్కువగా కృతజ్ఞతతో స్తుతించుచున్నాము.