Download PDFDownload eBook (ePub)
టెక్నాలజీతో మనం ఎలా సంబంధం కలిగి ఉండాలి?చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈరోజు టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. మునుపెన్నడూ ఊహించలేనంతగా ఈ టెక్నాలజీ మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మన జీవితాలను సులభముగా చేయడమే దీని యొక్క లక్ష్యము. దీనివలన అనేక లాభములు ఉన్నప్పటికీ మనము అనేకమైన దుష్పరిణామములు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ దుష్పరిణామములు మానవజాతిని శారీరకముగా, సామాజికంగా మరియు ఆత్మీయంగా ప్రభావితం చేస్తాయి.
దీనివలన కలిగే ఆత్మీయ ప్రమాదాలు ఏమిటి?
మన సమాజం ఈ టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేసుకుంటుంది?
పైన చెప్పిన విధముగా టెక్నాలజీని ఉపయోగించడం వలన అనేక పనులను సులభంగా చేయవచ్చు కానీ మన జీవితంలో దేవుడు లేకుండా దీనిని ఉపయోగించడం వలన ఇది మనుషులను అనేక పాపములు వైపు దారితీస్తుంది - దీని దుర్వినియోగం చాలా స్పష్టంగా చూడగలం. మనము టెలివిజన్, పర్సనల్ కంప్యూటర్స్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ మరియు టాబ్లెట్స్ కాలంలో జీవిస్తున్నాము. మనుషులు వారి వినోదం కొరకు ఈ పరికరాలతో ప్రతిరోజు ఎన్నో గంటలు గడుపుతున్నారు. అనేకమైన టెలివిజన్ కార్యక్రమాలు మరియు వీడియోలు ప్రజల యొక్క ఉత్సాహాన్ని, శరీర కోరికలను, హింసను, లైంగిక పాపములను, అనైతికతను, అలంకార వ్యర్ధతను మరియు దుర్మార్గాన్ని పెంచే విధంగా ఉన్నాయి.
కంప్యూటర్ గేములు వారిని వాస్తవికమైన జీవితానికి ఎంతో దూరంగా ఉండే ఊహా లోకంలో జీవించే జీవితాన్ని ఇస్తున్నాయి. అదే సమయంలో ఈ కంప్యూటర్ గేములు అవాస్తవికమైన బహుమతులు మరియు విజయాలుతో వారిని బానిసలుగా చేస్తున్నాయి. ఇంటర్నెట్ అందించే విస్తారమైన సమాచారం అనేకమందిని దానిలో లీనమగునట్లు చేసి ఇంకా ఎంతో తెలుసుకోవటంలో సంతోషపడుతూ, అహంకారంతో దాని గురించి గొప్పలు చెప్పుకునేటట్లు చేస్తుంది. ఒకరికి కావలసిన తక్షణ సమాచారాన్ని సర్చ్ ఇంజిన్లు ఇస్తున్నాయి, దానివల్ల ప్రజలు ఇతరుల సహాయం నాకు అవసరం లేదు అని భావిస్తున్నారు. నేటి యువతరం వారికి కావలసిన సమాచారాన్ని మరియు విషయాలను ఆన్ లైన్ ద్వారా నేర్చుకోవడం వలన వారికి తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేకుండా ఉంది. వారికి బోర్ కొట్టినప్పుడు వారు కొత్త వీడియోలు, వార్తలు, అప్లికేషన్లు, గేములు వెతకడంలో తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు - ఇవి ఎంతో విస్తారంగా ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి.
చాలా తొందరగా ఇంటర్నెట్లో సమాచారం పొందుకొనే సౌలభ్యం ఉండటం వలన ఎంతోమంది దీనిని అశ్లీల చిత్రాలు(పోర్నోగ్రఫీ) చూడటానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇవి ప్రజల హృదయాలను అపవిత్రతోను మరియు తృప్తి చెందని కామంతోను నింపుతున్నాయి. వీటన్నింటినీ మించి స్మార్ట్ ఫోన్లు ఇటువంటి అసభ్యకరమైన, అపవిత్రమైన వీడియోలను ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో ఉంచుతున్నాయి. ఇటువంటి పాపములకు మరియు వ్యర్థమైన వాటికి ఈ పరికరాలను ఉపయోగించడం ఎక్కువవడం మనం చూడగలం. పర్యావరణ దృష్ట్యా కూడా ప్రజలు ఈ పరికరాలను ఉపయోగించడం మానుకున్నట్లయితే కనీసం కొన్ని విద్యుత్ శక్తి కేంద్రాలైన ఆపివేయబడతాయి.
ఈ పరికరాలలో చిక్కుకోవడం వలన అనేక పరిణామాలు ఉన్నాయి. ఈ పరికరాలను తప్పుగా ఉపయోగించడం వలన అవి వ్యసనముగా మారుతాయి దాని వలన వాటిని ఉపయోగించేవారు నిజ జీవితంలో తమ బాధ్యతలను మరియు సంబంధాలను నిర్లక్ష్యము చేస్తారు. అవి క్రమక్రమముగా వాస్తవాన్ని ఎదుర్కునే శక్తి లేకుండా చేస్తాయి, వారు తమ సొంత లోకంలోనికి తప్పించుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే అక్కడ అన్ని పరిస్థితులు తమ ఆధీనంలో ఉన్నాయని అనుకుంటారు.
మన సమాజంలో మద్యపానము, ధూమపానముతో పాటు ఇటువంటి వాటిని నిపుణులు “ఆధునిక అనారోగ్యముగా” భావిస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స కూడా అవసరం కావచ్చు. వారు ఈ వినోదకరమైన వీడియోలను చూస్తున్నప్పుడు వారి హృదయ ఆలోచనలు కూడా కంప్యూటర్ తెరపై చూసే వాటిని బట్టి మారుతున్నాయి. వారు హృదయమందు కఠినపరచబడిన వారై, భ్రష్ట మనస్సుతో, చెడ్డ ఆలోచనలతో నిండుకొనిన వారై తమ సొంత కోరికలను నెరవేర్చుకుంటూ ఇతరులను ప్రేమించలేకపోతారు.
అయితే కొంతమంది ఇంటర్నెట్ ద్వారా మేము అనేకమంది స్నేహితులను సంపాదించుకున్నాం అని చెప్తారు, ఎందుకంటే కమ్యూనికేషన్ వేగంగా, సులభముగా మరియు తక్కువ ధరలో జరుగుతుంది. దూరం అనేది ఇప్పుడు ఏ మాత్రం అడ్డు కాదు - ఈ-మెయిల్స్, ఇంస్టెంట్ మెసేజింగ్, ఇంటర్నెట్ టెలిఫోనీ మరియు వీడియో కాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లులో ఒక్క క్లిక్కుతో ఒక కొత్త స్నేహితుడిని పొందవచ్చు. నిజానికి ఇంటర్నెట్ మనకు అనేకమంది ప్రజలను తెలుసుకునే అవకాశం ఇస్తుంది. సరైన మార్గంలో ఉపయోగిస్తే దీనివలన ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి.
ఎవరైతే చాలా దూరంగా ఉన్నారో అటువంటి వారితో సంబంధం కలిగి ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది, అయినప్పటికీ ఎవరైతే లోతైన సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడతారో వారు ఇది కేవలం తాత్కాలికమైన అవకాశంగా మాత్రమే భావిస్తారు.అయితే సోషల్ నెట్వర్కింగ్ లేదా చాట్ రూమ్స్ ద్వారా ఏర్పడే స్నేహాలు పైపైవిగా ఉంటున్నాయి మరియు ఈ స్నేహాలు ఒకరిపట్ల వేరుకరు శ్రద్ధతో, బాధ్యతలతో కాక సరదాల మీద వారి యొక్క భావోద్వేగాలు మీద ఆధారపడి ఉంటున్నాయి.
వీటిలో వారు నటిస్తూ ఉంటారు, నిజ జీవితంలో సాధ్యం కాని వాటిని ఈ సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు; ఎందుకంటే యూసర్ నేమ్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవడం ఎప్పుడూ సాధ్యము కాదు, ఒకరు మరొకరి లాగా లేదా ఉన్నదానికంటే ఎక్కువ ఆకర్షణీయముగా మరియు ప్రశంసనీయమైన స్వభావం గల వారిగా నటిస్తారు. వీటిలో బాధ్యత లేకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే అవకాశం ఎంతో ఉంది. నిజానికి వీటిలో యధార్ధమైన నమ్మకం, సంబంధాలు చూడటం చాలా కష్టమే.
చాలామంది ఈ డిజిటల్ పర్యావరణంలో లీనమై తమ స్మార్ట్ ఫోన్స్ లేదా కంప్యూటర్స్ నుండి ఇన్స్టెంట్ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నపుడు వారు ఇతర విషయముల పై ఏకాగ్రత చూపించలేకపోతున్నారు. ఇతరులతో నిజమైన సంబంధాలు ఏర్పర్చుకోవడానికి బదులు వారు ఎంతో సమయాన్ని ఈ పరికరాలు (గాడ్జెట్స్) తో గడుపుతున్నారు. వారి చుట్టూ ఉండే వారితో వారి యొక్క సంబంధం ఎంతో తగ్గిపోతుంది. వ్యక్తిగతముగా వారిని కలువకపోయినా తమకు తెరవెనుక ఎంతోమంది స్నేహితులు ఉన్నారనే భ్రమలో తమ ఒంటరితనాన్ని దాచిపెడతారు.
మొత్తానికి, మీకు దూరంగా ఉండే ప్రజలతో కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడే ఈ పరికరాల (గాడ్జెట్స్) వలన మీకు దగ్గరగా ఉండే ప్రజలకు మీరు దూరం కావచ్చు. వేగముగా సమర్థవంతముగా పనిచేసే ఈ పరికరాలు (గాడ్జెట్స్) ఉపయోగించడం వలన ముఖ్యమైన విషయాలు కోసం మీకు సమయం ఉండకపోవచ్చు.
కమ్యూనికేషన్ మరియు మల్టీమీడియా పరికరాలు మాత్రమే కాకుండా ఇలాంటి ఇతరమైన అనేక నూతన ఆవిష్కరణలు వలన ఎన్నో దుష్పరిణామాలు ఉంటున్నాయి, ఈ పరికరాలు ప్రజల జీవితాలలో ఒక భాగముగా మారిపోయాయి. ఇంతేకాకుండా, ఈ పరికరాలు ఉపయోగించడం వలన మన పర్యావరణం మీద, ఆరోగ్యం మీద మరియు మానవ హక్కుల మీద ఉండే దుష్పరిణామాల గురించి మాట్లాడటం ఈ ఆర్టికల్ యొక్క పరిధిని దాటిపోతుంది.
అయితే ఈ క్రింద చెప్పబడిన వాటిని తెలుసుకోవడం మంచిది:
చిన్నపిల్లలు మరియు యవ్వనులు మీద ఈ పరికరాలు కొన్ని దుష్పరిణామాలకు దారితీస్తున్నట్లుగా కొందరు న్యూరో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారు మల్టీటాస్కింగ్ ను ప్రోత్సహించడం వలన లోతుగా ఆలోచించడంను మరియు ఏకాగ్రతను చూపించలేకపోతున్నారు. మానవ హక్కులకు వ్యతిరేకముగా అనేకమైన ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు దౌర్జన్యమైన, కఠినమైన పరిస్థితులలో తయారు చేయబడుతున్నాయి. అత్యాశ కలిగిన ఉత్పత్తిదారులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేద ప్రజలను అనువుగా తీసుకుంటున్నారు. ఈ పేదవాళ్లు తమ రోజువారి ఆహారం కోసం నిరాశతో ఈ ఉత్పత్తిదారులు యొక్క డిమాండ్లను తీర్చడానికి ఎంతో తక్కువ జీతానికి అవమానకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.
ప్రజలు ఇంకా వీటన్నిటికీ
ఆకర్షితులవుతున్నారు … ఎందుకు?
వారి జీవితంలో ఇంకా ఏదో కొదువగా ఉంది. కాబట్టి వారు తృప్తి లేని వారుగా ఉన్నారు.ప్రజలు ఎందుకు వ్యర్థమైన వాటి వైపు తిరుగుతున్నారో దేవుని వాక్యములో,బైబిల్ లో, మనం దీనికి సమాధానం చూడగలం.
దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. (పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 1:18–22)
మన జీవితాలకు భద్రత, సహాయం మరియు పరమార్థం కేవలం దేవునిలో మాత్రమే పొందుకోగలం - మనము ఈ విధముగానే సృష్టింపబడ్డాము. ఒకవేళ మనము దేవునిని తృణీకరించి ఆయన నుండి వేరైన యెడల, అప్పుడు మనము ఒంటరిగా మిగిలిపోయి దేవుని స్థానంలో వేరొక ప్రత్యామ్నాయం వెతుకుకుంటాము. చరిత్రలో కూడా మానవుడు దేవునికి బదులుగా అనేకమైన వాటితో తమ జీవితాలను నింపుకున్నారు. ఉదాహరణకు ఎక్కువ ఆహారం తినడం మరియు మద్యము సేవించడం, వ్యర్థమైన వాటియందు అనైతికమైన వాటియందు వినోదాన్ని వెతకడం లేదా డబ్బుల పై అత్యాశ కలిగి ఉండడం. ప్రజలు అనేకమైన నూతన ఆలోచనలతో వస్తూనే ఉంటారు కానీ వారు ఎప్పటికీ తృప్తి చెందరు. తప్పు ఏంటని అడిగి తెలుసుకొని నిజమైన పరిష్కారం కోసం వెతకటానికి బదులుగా చాలామంది నిరాశలోనికి, నిస్పృహలోనికి దారితీసే తాత్కాలికమైన వ్యర్థ ఆనందాన్ని కోరుకుంటారు - ఇవి పాపము యొక్క పరిణామాలు. వారు జీవితంలో చాలా ముఖ్యమైన విషయములు గురించి ఆలోచించడం నుంచి తప్పించుకుంటారు.అయితే వారు దేవునిలో తృప్తిని వెతకరు కానీ గతించిపోయే వీటిని అంటిపెట్టుకొని వుంటారు.
ఈ లోకంలో ఏవైతే విలువైనవిగా భావించబడతాయో అవి శరీరం యొక్క ఆనందం మీద, స్వార్ధంతో కూడిన ఆశల మీద మరియు అహంకారం మీద ఆధారపడి ఉన్నాయి. మన ఆత్మను నాశనంలోనికి నడిపించే ఈ స్వభావముల గురించి బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది.
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. (యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2:15–17)
పైన చెప్పబడిన విధముగా అనేకమైన పనులు ఎంతో సులభంగా, తొందరగా టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా చేయగలము. ఈ పరికరాలను తయారుచేసేవారు వారు సాధించిన దానిని బట్టి ఎంతో అహంకారంతో గొప్పలు చెప్పుకుంటూ తమ విజయాన్ని చూసి స్వార్థమైన ఆశయాలతో ఇంకా ఇటువంటి వాటిని తయారుచేయడానికి ప్రేరేపించబడుతున్నారు. వారు ఈ సృజనాత్మకతను వారికి ఇచ్చి ఈ పనులు సాధ్యమయ్యేటట్లు చేస్తున్న వానిని మర్చిపోతున్నారు.
స్వార్థము మరియు అహంకారము అనే సమస్యలు టెక్నాలజీ ద్వారా పరిష్కరింపబడవు. ఈ లోకంలో ఉన్నవాటిని పోగుచేసుకోవడం మరియు అత్యాశలను గూర్చి బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. దీనికి బదులుగా మన జీవితాలను ప్రేమించుటకు మరియు సేవించుటకు అప్పగించుకోవాలి.
మరియు ఆయన వారితోమీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను. (లూకా సువార్త 12:15–21)
తమ జీవితాలలో దేవుడు లేకపోతే ప్రజల యొక్క విలువలు ఇతరులు ఏం ఆలోచిస్తారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వారు ఇతరుల చేత అంగీకరించబడాలని అనుకుంటారు, ఉదాహరణకు, నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోతే ఇతరులు నన్ను తక్కువగా చూస్తారేమో అని భయపడతారు. మరొకవైపు, వారు, నా దగ్గర మంచిది లేక నూతనమైనది ఉంది అని ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. వారి జీవితాలు అహంకారంతోను మరియు అసూయతోను నిండుకొని ఉంటాయి.
టెక్నాలజీని సరైన విధానంలో మనం ఎలా ఉపయోగించగలము?
మానవజాతి పట్ల దేవుని అసలైన సంకల్పానికి, టెక్నాలజీని ఉపయోగించడానికి ఎటువంటి విరుద్ధత లేదు. దేవుడు ప్రతి దానిని ఎంతో మంచిదిగా నిర్మించాడు. పంటలను పండించుటకును మరియు తన చిత్త ప్రకారం సృష్టిని జాగ్రత్తగా చూసుకోవాడానికి మనిషికి సమస్తము పైన అధికారాన్ని ఇచ్చాడు.
దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీకిచ్చి యున్నాను; అవి మీకాహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. (ఆదికాండము1:28–31)
దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. (ఆదికాండము 2:15)
మనిషి దేవుడి దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నాడో దానిని బాధ్యతతో ఉపయోగించుకొనుటకు, నిర్వహించుటకు దేవుడు ఈ బాధ్యతను అతనికి అప్పగించాడు, మనుష్యుల యొక్క స్వార్థం కొరకు కాదు గాని మానవజాతి అంతటికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఇలా మనిషికి ఈ బాధ్యతను అప్పగించాడు.
ఈ ఉద్దేశంతో దేవుడు మనిషికి నిర్వహించే, అర్థం చేసుకునే, అంచనావేసే, పర్యవేక్షించే, ఆవిష్కరించే సామర్థ్యాలను ఇచ్చాడు. మనిషి తనంతట తానే పని చేసుకోవాలని కాదు గాని దేవునితో సహకరించాలని ఆయన ఉద్దేశం. దేవుని ప్రేమకు సరైన ప్రతిస్పందన మనిషి ఆయన యొక్క సృష్టిని గౌరవించి ఆయనను సంతోషపరిచే ఘనపరిచే పనులను నమ్మకంతో చేయడమే. కాబట్టి మనిషి తన సృజనాత్మకతను మంచి విషయములు కొరకే ఉపయోగించడం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం.
అయితే మనిషి యొక్క పాపం లోకమును పతన స్థితికి చేర్చింది, దీనివలన మనుష్యుల యొక్క జీవితాలలో దేవుడు తాను ఉండవలసిన స్థానంలో ఇక పై లేడు. మనుషులు తాము ఏ ఉద్దేశం కొరకు సృష్టించబడ్డారో ఆ దృష్టిని కోల్పోయారు - వారు తమ మంచి మనస్సుని పోగొట్టుకున్నారు.
దేవుని సృష్టిలో ముందుగా లేనటువంటి స్వార్థము మరియు చెడు ఉద్దేశాలు ఈ లోకంలో భాగముగా మారిపోయాయి. నీతిమంతుడైన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని దానిని చేయటానికి బదులుగా ప్రజలు తమ స్వార్ధ క్రియలు చేయడానిని ఎంచుకున్నారు. మనిషి ఏదైనా మంచి పనులు చేయడానికి అసమర్థుడిగా మారిపోయాడని దీని అర్థం కాదు; అనైతికంగా మరియు పాపిష్టిదిగా మారిపోయిన ఈ లోకంలో మనిషి ఇప్పటికీ మనస్సాక్షిని అనుసరించి మంచి పనులు చేయడానికి స్వతంత్రం కలిగి ఉన్నాడు. ఇందువలన, ఆవిష్కరణలు చేయడం మంచిదా చెడ్డదా అని తీర్ఫు తీర్చడం కొన్నిసార్లు కష్టము. ఆవిష్కరణను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే అన్ని సందర్భాలలో సులభముగా మనము మంచిదా చెడ్డదా అని వివరణ ఇవ్వలేము.
ఉదాహరణగా ఒక చాకును తీసుకుందాం : దీనిని ఆకలి వేసేవారికి భోజనము సిద్ధపరచుటకు ఉపయోగించవచ్చు అదే విధముగా ఒకరు తన హృదయంలో ద్వేషము కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారికి హాని చేయుటకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. మనుష్యుని యొక్క ఉద్దేశ్యములు మరియు వైఖరులు ఎంతో గొప్ప పాత్రను పోషించడం ఈ విషయంలో మనం చూడవచ్చు; దీన్ని గురుంచే బైబిల్ మాట్లాడుతుంది.
అందువలన టెక్నాలజీ పట్ల సరైన వైఖరి కలిగి ఉండుటకై మనము ఈ లోక సంబంధమైన వైఖరిని తిరస్కరించాలి. ఎందుకంటే మారుమనస్సు నిమిత్తము మనల్ని పిలుస్తూ, మన హృదయాలను, మనసులను మరియు జీవితాలను మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు నుంచి ఇవి మనల్ని దూరం చేస్తాయి.
కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసునుగూర్చి విని, ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. (పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4:17–24)
ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. (పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 3:3–5)
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. (పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 12:1–2)
అతని ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మరియు ఇతర విశ్వాసుల ద్వారా టెక్నాలజీని జ్ఞానంతోను ఆశా నిగ్రహముతోనూ ఎలా ఉపయోగించుకోవాలో దేవుడు మనకు దారి చూపగలడు. మనము ఆయనకు విధేయులమైతే, స్వార్థమైన ఆశయాలతో నడిపించబడుతున్న ఈ లోకము యొక్క బానిసత్వము నుండి ఒత్తిడి నుండి మనల్ని ఆయన వినిపించగలడు.
ఆయన వాక్యము మనకు ఇలా చెప్తుంది:
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.ప్రతివిధమైన కీడునకును దూరముగా ఉండుడి. (పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక 5:21–22)
ఈ లోకం మనకు ఇస్తున్న వాటిని ఉపయోగించాలో లేదో మరియు ఎలా ఉపయోగించాలో అని మంచికి చెడుకు తేడా గుర్తించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అతను మనము అనుసరించుటకై నిజమైన మరియు శాశ్వతమైన విలువలను చూపిస్తాడు మరియు చెడ్డ వాటిని వ్యతిరేకించటకు ఈ లోక సంబంధమైన శోధనలను ఎదుర్కొనుటకు మనకు సహాయం చేస్తాడు; నిజమైన స్వతంత్రంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. టెక్నాలజీ చేయలేని వాటిని దేవుడు చేయగలడు: ఆయన మన హృదయములను శుద్ధి చేయగలడు మరియు ప్రేమతో, సమాధానముతో, లోతైన, శాశ్వతమైన సంబంధములు కలిగిన జీవితంలోనికి ఆయన మనల్ని నడిపించగలడు. మనము ఇక పై నశించిపోయే వాటి మీద దృష్టి ఉంచేవారము కాము.
ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన వైఖరిని ఈ క్రింది వాక్యములు చూపిస్తాయి:
సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. (పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 7:29–31)
చివరి మాటలు
ఈ ఆధునిక టెక్నాలజీ ఇప్పటికే మీ జీవితాలలో చెడు ప్రభావం కలిగించినట్లయితే, క్షణికమైన ఆనందాన్ని కలిగించే వీటికి మోసపోవద్దని బానిసలు కావద్దని మేము మిమ్ములను వేడుకుంటున్నాము. అవి అంతకంతకూ మీ యొక్క స్వాతంత్రమును, గౌరవమును దోచుకుని మిమ్ములను శూన్యము లోనికి నడిపిస్తాయి.
వాస్తవమైన లోకములో నుంచి ఊహా లోకంలోనికి పారిపోవడం వలన సమస్యలు పరిష్కారం కావు. కొన్నిసార్లు కష్టముగా ఉన్నప్పటికీ వాస్తవాన్ని ఎదుర్కొని, మన జీవితంకు ఇతరుల యొక్క జీవితములకు బాధ్యతను మనము తీసుకున్నప్పుడు మాత్రమే మనము సమస్యకు పరిష్కారం కనుగొనగలము. ఊహా లోకంలో దాక్కోవడానికి బదులుగా నిజమైన ప్రేమలో వాస్తవమైన సంబంధాలను ప్రజలతోను మరి ముఖ్యముగా మన జీవితాలకు ఏది మంచిదో తెలిసినవాడు మరియు వాస్తవానికి మూలమైనవాడు అయిన దేవునితోను కలిగి ఉండడం ఎంతో మంచిది. ఈ విషయమును గురించి మా అనుభవాలను మరియు ఆలోచనలను మీతో పంచుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానించాలని ఇష్టపడుతున్నాము. గతములో మేము కూడా ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్లి యేసుక్రీస్తు ద్వారా దాని నుంచి బయటికి వచ్చే మార్గాన్ని కనుగొన్నాము.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. (మత్తయి సువార్త 11:28–30)