పాపము నుండి విడుదల

దేవుని చిత్తప్రకారము పవిత్రముగా పరిశుద్ధముగా జీవితమును జీవించుట

 పరిశుద్ధముగా ఉండడం అంటే అర్థం ఏమిటి? మనము మన నుండి మరియు ఇతరుల నుండి పరిశుద్ధమైన జీవితమును ఆశించవచ్చా? పాపము నుండి విడుదల పొందడం సాధ్యమేనా? దీని గురించి బైబిల్ ఏమి చెబుతుంది?

నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది”. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. (1 పేతురు 1:14–16)

 బైబుల్లో నూతన నిబంధనను వ్రాసినవారు క్రైస్తవులను ‘పరిశుద్ధులనియు మరియు ప్రియులనియు’ పిలిచారు. (ఉదా. కొలొస్స 3:12). ఈ రోజుల్లో ఉన్న ప్రజలకు “పరిశుద్ధత” మరియు “పరిశుద్ధులు” అనే పదాలు పాతవిగాను, మన అనుదిన జీవితానికి దూరమైనవిగాను, ఇవి కొంతమంది ప్రత్యేకించబడిన వ్యక్తులకు మాత్రమే మనకు కాదులే, ఇవి మనకు సాధ్యం  కావులే అన్నట్లు అనిపిస్తాయి.

 కానీ పవిత్ర జీవితం ద్వారా మాత్రమే మనం దేవునితో సంబంధం కలిగి ఉండగలమని బైబిల్ చెప్పట్లేదా?

మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యోహాను 1: 5–7)

 

నిజానికి పరిశుద్ధముగా ఉండమనే  దేవుని ఆజ్ఞ మనల్ని నిత్యజీవితముకు సిద్ధపరుస్తుంది. పరిశుద్ధత లేకుండా పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన దేవునితో ఇప్పుడు గాని పరలోకములోగాని మనం సహవాసము కలిగి ఉండలేము. పరిశుద్ధత అనేది పరలోకమునకు ప్రవేశ పరీక్ష వంటిది కాదు, పాస్ మార్కుతో  పరలోకంలోప్రవేశించొచ్చు అని అనుకోలేము కానీ పరిశుద్ధత దేవుని స్వబావం అది మారదు. కాబట్టి మనము కూడా అలాగే జీవించాలి.

పైన చెప్పబడిన వాక్య భాగములు దేవుని యొక్క పరిపూర్ణ పరిశుద్ధతను మరియు దానికి అనుగుణముగా దేవుని చేత పరిశుద్దపరచబడుటకు మన పూర్తి జీవితం మీద ఆయన అధికారమునకు ఒప్పుకోవలసిన అవసరతను తెలుపుతుంది. ప్రతి పాపమును విడిచి పెట్టవలసిన అవసరతను కూడా తెలుపుతుంది.

 దేవుడు ఎలాగైతే పరిశుద్ధముగా ఉన్నాడో అలాగే పరిశుద్ధంగా ఉండాలనే కోరిక ఒక క్రైస్తవుడి యొక్క స్వభావముగా ఉంటుంది. ఎంతోమంది ప్రజలు మరియు క్రైస్తవులని చెప్పుకునేవాళ్ళు కూడా దీని గురించి పోరాడరు, ప్రయత్నించరు. అయినప్పటికీ దేవుడు అనుగ్రహించు రక్షణ మరియు బలము వలన మనం ఆయన వైపు తిరిగినట్లయితే నూతన నిరీక్షణతో పాపమునకు విరుద్ధముగా మనం పోరాటం చేయవచ్చు.

పరిశుద్ధమైన జీవితము కోసం పాపములకు విరుద్ధంగా పోరాడటం అవసరం

 దేవుడు మనిషిని తన స్వరూపమందు నిర్మించాడు. ఎప్పుడైతే అతడు పాపం చేశాడో దేవునితో అతనికి ఉన్న సహవాసం మరియు దేవుడిచ్చిన స్వభావమునకు అంతరాయం కలిగింది. పాపం అనేది ప్రజలను వేరు చేసి స్వార్థపూరితమైన జీవితంలోనికి మరియు ఒంటరితనానికి నడిపిస్తుంది. అందువలననే యేసుక్రీస్తు పాపమును ద్వేషించాలని తిరస్కరించాలని చాలా బలమైన వాక్యములు ఉపయోగించారు.

నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. (మార్కు 9:43–47)

 ఇది మనల్ని భయపెట్టడానికి యేసుక్రీస్తు ఉపయోగించిన ఒక బెదిరింపు కాదు. యేసు మనకు ఒక ఆత్మీయ సత్యాన్నిచూపించాలని అనుకుంటున్నారు. పాపములు ప్రజలను మార్చి తమ్మును తామే మోసపరుచుకునేటట్లు తమ్మును తామే కఠినపరచుకొనేటట్లు చేసి దేవుని కొరకు మరియు మంచి విషయముల కొరకు ఉండవలసిన కోరికను తీసివేస్తాయి. పాపము ప్రజలను దేవుని నుండి వేరు చేస్తుంది. పౌలు కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో ఈ విధముగా చెప్పారు.

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.  (కొలొస్స 3:5)

పాపము మన ఆలోచనల్లోనూ మరియు స్వభావంలోనూ మొదలయి మన క్రియల ద్వారా బయటపడుతుంది.

నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. (మత్తయి5:28)

నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. (మత్తయి 5:21–22) 

కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును. (యాకోబు4:17)

చాలామంది ప్రజలు తమ జీవితంలో తాము చేస్తోంది పాపమని తెలిసి కూడా వాటి గురుంచి అంత లోతుగా ఆలోచించరు. బైబిల్ చదవకపోవడం మరియు విశ్వాసంలో ఉన్న తోటి సహోదరుల యొక్క ఆత్మీయ జీవితం గురుంచి పట్టించుకోరు. ఈ పాపములకు వారు అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ ఈ పాపములు దేవునితో మన సంబంధంలో ఉన్న లోపాన్ని చాలా స్పష్టంగా చూపిస్తాయి.

పాపమునకు ఏ సాకు ఉండదు.

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంత కంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును. (1 కొరింథీ 10:13)

పాత నిబంధన గ్రంథములో కూడా పాపము పై విజయం పొందాలని ఆజ్ఞాపించబడింది మరియు సాధ్యమే.

యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. (ఆదికాండము 4:6–7)

పాపమునకు తమ్మును తాము దూరముగా ఉంచుకోవాలని మరియు తమ జీవితాలను దేవునికి అప్పగించికోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి దగ్గరకు ఎంతో ప్రేమతోనూ  మరియు దయతోనూ దేవుడు వస్తాడు. అయినప్పటికీ తమ పాపములను తమ బలహీనతలుగా సాకులు చెప్పే వారిపట్ల దేవుని ఉగ్రత ఎంతో గొప్పది, అందుకనే:

రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.(యెషయా59:1–2)

ఎంత పాపభారంతో దిగజారిపోయిన వ్యక్తయినా తాను దేవుని దగ్గరకు రావాలనుకుంటే దేవుడు ఎవరినైనా ప్రేమిస్తాడని, అంగీకరిస్తాడని మనకు తెలుసు. దేవుడు నమ్మదగినవాడు కనుక తన దగ్గరకు రావాలనుకునేవారిని ఎప్పుడూ తిరస్కరించడని మనకు తెలుసు. అయినప్పటికీ పాపం మనల్ని దేవుడు నుంచి దూరం చేస్తుందని గుర్తుంచుకోవాలి. పాపము చాలా ప్రమాదకరమైనది, దానితో మనం ఆడకూడదు.

పాప క్షమాపణ అనేది ఎంతో గొప్ప బహుమానం దాని యొక్క విలువను తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం. ఈ క్షమాపణను మనం చులకనగా చూడకూడదు. ఎందుకంటే మనల్ని పాపము నుంచి రక్షించడానికి యేసు తన ప్రాణమును సహితం ఇచ్చారు. అందువలననే మనం మన జీవితాలను పాపము నుంచి విముక్తి పొందిన ప్రజల వలే జీవించాలే తప్ప పాపమును అంటిపెట్టుకునే జీవితం జీవించకూడదు.

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తము చేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా.  (1 పేతురు 1:18–19)

పాపమును జయించడం

మనం మన పాపములను ఒప్పుకోవడం వలన మాత్రమే మనము క్షమాపణ మరియు స్వతంత్రం పొందుకోగలమని కీర్తనలు 32:3–5 మరియు సామెతలు 28:13 లోను చెప్పబడింది. 

అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు.

మన పాపములను దేవుని ముందు ఒప్పుకోవడం ముఖ్యమైనది మరియు ఎంతో మంచిది కానీ ఇతర ప్రజలు ముందు కూడా ఒప్పుకుంటేనే అది నిజమైన పశ్చాత్తాపం. మనము సత్యములో జీవించినట్లయితే మన సహోదర సహోదరీలు ముందు కూడా సత్యంలోనే నడుస్తాము.

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.(1 యోహాను 1:9)

మనం క్రీస్తుతో మన జీవితమును ప్రారంభించినప్పుడు మాత్రమే మన పాపములను ఒప్పుకొని లోకాన్ని విడిచిపెడితే సరిపోదు కానీ మనము మన క్రైస్తవ జీవితం  అంతా మన సహోదర సహోదరీలతోని మన పాపములను ఒప్పుకుంటూ ఉండాలి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడం ద్వారా మనం పరిశుద్ధపరచబడతామని యాకోబు తన పత్రికలో రాశారు.

మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. (యాకోబు 5:16)

మనము మన పాపములను ప్రత్యేకించబడిన సేవకులతో ఒప్పుకోవాలని మనం బైబిల్ లో ఎక్కడా చూడము. కానీ నేను దేవుని ముందు ఎలాగ నిలబడుతున్నానో అలాగే తోటి విశ్వాసుల ముందు కూడా లోతైన నమ్మకం కలిగి నిలబడాలనేది మనం బైబిల్ లో చూస్తాము. ఇలాంటి జీవితమే సంఘములో దేవుడు ఉన్నాడనేదానికి సాక్ష్యం.

ఈ విధముగా మాత్రమే సహోదర, సహోదరీలు ఒకరికి ఒకరు సహాయము చేయడం నిజముగా సాధ్యమవుతుంది. ఇది ఏలాగనగా మన పాపములను ఒకరి ముందు ఒకరు పెట్టడం, క్షమాపణ తీసుకోవడం, వారి ప్రార్ధనలలో మోయబడటం మరియు పరిశుద్ధ జీవితం కోసం ఒకరిని ఒకరు హెచ్చరించి, ఆదరించి మనం సహాయం చేసుకోగలము.

యేసుక్రీస్తు తన శిష్యుల యొక్క పాదములు కడిగి అలా చేయడం ద్వారా మనం ఒకరికి ఒకరు ఎలాగ సేవ చేయాలి అనే దానికి  ఒక ఉదాహరణ ఇచ్చారు (యోహాను13:2–17).  పాపములో జీవిస్తున్న ప్రజల ముందు తనను తాను తగ్గించుకోవడం ద్వారా  తన యొక్క గొప్ప ప్రేమను ఆయన చూపించాడు. ఒకరి ముందు ఒకరు తగ్గించుకోవడం, ఒకరిని మరొకరు ప్రేమతో సహించడం మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ విధముగా మనం పరిశుద్ధతలో ఎదుగుతూ ఇతరుల యొక్క ఎదుగుదల కోసం సహాయం చేయగలము.

ఎదుటివారి రక్షణ కోసం పోరాడటం అంటే వారికి సేవ చేయడమే — దాని అర్థం వారు విశ్వాసంలో ఎదిగే విషయంలో సహాయం చేసి, దేవునికి దగ్గరగా ఉండుటకు ఏ పాపము వారిని ఆటంకపరచకుండునట్లు చూసుకోవడం. దేవుడు ప్రతి క్రైస్తవుడిని ఇతరులకు సహాయం చేయగల సామర్థ్యం కలవారిగా చేశాడు. దీని వలన సంఘమంతా పరిశుద్ధ ఆలయముగా కట్టబడుతుంది (ఎఫెసీ 2:21). ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి దేవుడు సంఘంలో ఉండే ప్రతి ఒకరికి బాధ్యతను ఇచ్చాడు. అందువలన 

అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు. (హెబ్రీ 12:14)

Scroll to top ↑